Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్‌ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవల గుంతలో పడి బైకర్ చనిపోయిన సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్‌ మ్యాన్‌హోల్‌లో పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

ఇటీవల ఢిల్లీలో జల్ బోర్డు అధికారులు నడిరోడ్డుపై గుంత తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీంతో ఒక బైకర్ తెలియకుండా వచ్చేయడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కాకముందే మరో ఘోరం జరిగింది మ్యాన్‌హోల్‌ను ఓపెన్ చేసి ఉంచడంతో యువకుడు బిర్జు కుమార్ (30) మృతి చెందాడు. ఒక దుర్ఘటన జరిగి పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా అధికారులు పాఠం నేర్చుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం పోయింది.

రోహిణిలోని బేగంపూర్ ప్రాంతంలో మహాశక్తి కాళి ఆలయానికి సమీపంలోని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) భూమిలోని మ్యాన్‌హోల్‌ ఓపెన్ చేసిందని.. అయితే 30 ఏళ్ల బిర్జు కుమార్ అనే కార్మికుడు, అతని స్నేహితుడు ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బిర్జు కుమార్, స్నేహితుడు కూడా కార్మికులేనని.. ఇద్దరూ రోజంతా మద్యం సేవించి ఉన్నారని.. సంఘటన జరిగిన సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నారని వెల్లడించారు.

బిర్జు కుమార్ సోమవారం రాత్రి పడిపోగా.. మరుసటి రోజు మృతదేహం లభించింది. బిర్జు కుమార్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నించానని, కానీ స్పందన రాలేదని, బాగా తాగి ఉండటంతో ఇంటికి వెళ్లానని స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు కూడా కుమార్ జాడ తెలియకపోవడంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టగా మ్యాన్‌హోల్ పక్కన అతని చెప్పులు కనిపించాయని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమార్ మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీసిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవాడిగా గుర్తించారు.

ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. రేఖ గుప్తా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ప్రసంగాలపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వాన్ని నడపడడం చేతకావడం లేదని మండిపడ్డారు.

Exit mobile version