NTV Telugu Site icon

Mamata Banerjee: విషపూరిత పామును పెంచుకోవచ్చు.. కానీ బీజేపీని నమ్మలేం..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృ‌ణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని, పారామిలిటరీ బలగాలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తుందని అన్నారు. గురువారం కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు, బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) కాషాయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె డిమాండ్ చేశారు.

‘‘ ఆవాస్ యోజన కోసం మళ్లీ పేర్లు నమోదు చేసుకోవాలని బీజేపీ ప్రజల్ని అడుగుతోంది. పేర్లు మళ్లీ ఎందుకు నమోదు చేయాలి.? మీరు విషపూరిత పామును నమ్మవచ్చు, మీరు దానిని పెంచుకోవచ్చు, కానీ మీరు బీజేపీని నమ్మలేరు, బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ దర్యాప్తు సంస్థల ముందు తల వంచబోదని, లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్ఎఫ్ స్థానిక ప్రజల్ని హింసిస్తే పోలీసులకు ఫిర్యాదు చేుయాలని కూచ్ బెహర్ మహిళలకు దీదీ పిలుపునిచ్చారు.

Read Also: KA Paul: వచ్చేది పాల్‌ ప్రభుత్వమే.. విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా..!

కేంద్రమంత్రి నిసిత్ ప్రమాణిక్‌పై విమర్శలు చేశారు. అనేక కేసుల్లో ఉన్న ప్రమాణిక్ హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా నియమించడం దేశానికి అవమానకరమైన విషయమని, టీఎంసీ 2018లో అతడిని పార్టీ నుంచి తొలగిస్తే, తర్వాత బీజేపీలో చేరారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడాన్ని తమ ప్రభుత్వం అనుమతించదని మమత స్పష్టం చేశారు. ఈ చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే వారిని విదేశీయులుగా పరిగణిస్తారని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేయవద్దని సలహా ఇచ్చారు. సీఏఏపై బీజేపీ అబద్దాలు చెబుతోందని ఆరోపించారు.

సీఏఏ కమిటీలో జనాభా లెక్కల విభాగానికి చెందిన ఒక సభ్యుడిని చేర్చడాన్ని ప్రశ్నిస్తూ.. భవిష్యత్తుల్లో ఎన్ఆర్సీ కోసం ఎలాంటి ప్రణాళిక లేకపోతే అలాంటి వ్యక్తిని ఎందుకు కమిటీలో చేర్చారు..? అని ప్రశ్నించారు. సీఏఏ తల అయితే, ఎన్ఆర్సీ తోక అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని, మీరు బీజేపీని ఓడించాలంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు, మైనారిటీ పార్టీగా ఉన్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)కి ఓటేయవద్దని కోరారు. ఐఎస్ఎఫ్ ఎంఐఎం లాగే ఉందని, వారు మైనారిటీ ఓట్లు చీల్చి బీజేపీకి సాయం చేస్తున్నారంటూ విమర్శించారు.