Site icon NTV Telugu

మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!

దేశ రాజ‌కీయాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.  ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించారు.  మోడీని ఎదుర్కొనేందుకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు.  అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు క‌లిపి పోటీ చేస్తుండేవి.  కానీ, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త ఒక్క‌రే త‌ల‌పడ్డారు. గ‌తంలో వ‌చ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ విజ‌యం సాధించింది.  అయితే, గ‌తంలో బెంగాలో చ‌క్రం తిప్పిన వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయింది.  బీజేపీ త‌న బ‌లాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకున్న‌ది. దేశంలో క‌రోనా, నిరుద్యోగం, పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల, రైతు స‌మ‌స్య‌లు వంటివి కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నాయి.  

Read: చిరు ‘లూసిఫర్’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…

ఈ స‌మ‌యంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిపక్షాలు అన్ని క‌లిసి పోరాటం చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, కాంగ్రెస్ పార్టీ గ‌తంలో కంటే బ‌ల‌హీనంగా ఉండ‌టం దీదీకి క‌లిసి వ‌చ్చేలా క‌నిపిస్తున్న‌ది.  ఎందుకంటే, బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని తృణ‌మూల్ చావుదెబ్బ కొట్టింది.  అటు వామ‌ప‌క్ష పార్టీలు సైతం మ‌ట్టిక‌రిసిపోయాయి.  ఇది దీదీకి కొండంత బ‌లాన్ని ఇచ్చాయి అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  ఎన్నిక‌ల‌కు ముందు పార్టీని వ‌దిలి వెళ్లిన నేత‌లు తిరిగి పార్టీలో చేరే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.  దేశంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న ప్ర‌ధాని మోడిని ఎదుర్కొనే స‌త్తా దీదీకి ఉంద‌ని అనేక క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.  గ‌తంలో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన దీదీ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న‌ది అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  ఇందులో భాగంగానే దీదీ నాలుగు రోజుల పాటు ఢీల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.  పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో దేశంలోని అన్ని పార్టీల‌కు చెందిన ఎంపీలు ఢీల్లీలో ఉంటారు కాబట్టి మంత‌నాలు జ‌రిపేందుకు వీలుగా ఉంటుంది.  ఒక‌వేళ దీదీ ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగితే పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  అటు ఆప్ కూడా క్ర‌మంగా రాష్ట్రాల్లో బ‌లం పెంచుకోవ‌డానికి పావులు క‌దుపుతున్న‌ది.  

Exit mobile version