పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి, మేనల్లుడు అభిషేక్ బెనర్జీలకు జెడ్ ప్లస్ భద్రత తొలగించవచ్చని వార్తలు హల్‌చల్ చేశాయి. బుధవారం ఉదయం ఇద్దరి ఇళ్ల దగ్గర ఉన్న భద్రతను, బారికేడ్లను తొలగించారు. దీంతో భద్రతను తొలగించబోతున్నారంటూ ప్రచారం ఊపుందుకుంది. ఈ ఘటన కొత్త రాజకీయ వివాదానికి తెర లేపింది.
భద్రత తొలగింపు వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఆ ఇద్దరు నాయకుల భద్రతను ఉపసంహరించడం లేదని తెలిపాయి. మమతా, అభిషేక్‌లకు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని పేర్కొన్నాయి. భద్రత కోసం మూడు షిఫ్టులలో మొత్తం 248 మంది భద్రతా సిబ్బంది ఉంటారని తెలిపాయి. అయితే అదనపు భద్రత మాత్రం తొలగించబడుతుందని వెల్లడించాయి.
కోల్‌కతాలోని హరీష్ ముఖర్జీ రోడ్‌లో ఉన్న అభిషేక్ బెనర్జీ నివాసం, కామాక్ స్ట్రీట్‌లోని కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన అదనపు పోలీసు బలగాలను, ప్రాంతీయ భద్రతా ఏర్పాట్లను తొలగించారు. అయితే భద్రతలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు తెలిపారు. పాత విధానం ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎక్కడికైనా ప్రయాణించే ముందు పోలీసు అధికారులు మార్గాన్ని తనిఖీ చేసేవారు. ఇకపై మాత్రం ప్రయాణానికి ముందు ఏ పోలీసు వాహనం కూడా మార్గాన్ని ముందుగా తనిఖీ చేయడం గానీ.. రహదారిపై ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేయడం గానీ జరగదని అధికారులు పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు కమలం పార్టీ సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకుంది. ఇక భబనీపూర్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. సువేందు అధికారి చేతిలో 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక మీడియాతో మమత మాట్లాడుతూ.. ‘‘నేను ఓడిపోలేదని.. రాజీనామా చేయనని.. లోక్‌భవన్‌కు వెళ్లను.’’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
