Mallikarjun Kharge: దేవెగౌడపై ఖర్గే పంచ్‌లు.. నవ్వులు చిందించిన మోడీ

  • రాజ్యసభలో ఆహ్లాదకర వాతావరణం
  • సభలో మల్లిఖార్జున ఖర్గే పంచ్‌లు
  • నవ్వులు చిందించిన మోడీ.. సభ్యులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Modi

Modi

ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సరదా సన్నివేశాలు కరవయ్యాయి. సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా నిరసనలు, నినాదాలతో సభలు దద్దరిల్లుతున్నాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధంతో గందరగోళం నెలకొంటోంది. బుధవారం మాత్రం రాజ్యసభ ఆహ్లాదకరంగా.. ఉల్లాసభరితంగా మారిపోయింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున వేసిన పంచ్‌లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. ప్రధాని మోడీ సహా సభ్యులంతా మనస్పూర్తిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వచ్చే నెలలో పలువురు రాజ్యసభ సభ్యులు నిష్క్రమించనున్నారు. దీంతో బుధవారం సభ్యులకు వీడ్కోలు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని.. చాలా కాలం సన్నిహితంగా పని చేసినట్లుగా గుర్తుచేశారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ మాతో ఉంటుండగానే అధికార పార్టీతో చేతులు కలిపారన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. మాతో డేటింగ్ చేసి.. చివరికి వారిని పెళ్లిని చేసుకున్నారని పంచ్ వేశారు. ఈ డైలాగ్‌తో ప్రధాని మోడీ సహా సహచర ఎంపీలంతా నవ్వుకున్నారు. అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

1996లో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా కొంత కాలం పనిచేశారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేశాయి. ఆ తర్వాత ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్‌.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతోంది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.