Gaganyaan: ప్రముఖ మలయాళ నటి లీనా తాను ‘గగన్‌యాన్’ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని ప్రకటన అనంతరం లీనా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు.
READ ALSO: Jio phone: క్వాల్‌కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..
ఈ జంట జనవరి 17న వివాహం చేసుకోగా, ఫిబ్రవరి 27న లీనా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఈరోజు 27 ఫిబ్రవరి 2024న మన ప్రధాని మోదీ జీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామిగా ఆస్ట్రోనాట్ వింగ్‌ని ప్రదానం చేశారు. ఇది మన దేశానికి, కేరళకి, ముఖ్యంగా నాకు గర్వకారణం’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జనవరి నెలలోనే పెళ్లి జరిగినప్పటికీ, గోప్యత కోసం ఈ విషయాన్ని వెల్లడించలేదు. లీనా ప్రముఖంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో పనిచేశారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాష చిత్రాల్లో కూడా నటించారు. మలయాళంలో 100కి పైగా చిత్రాల్లో పనిచేశారు.
అంతకుముందు, ఈ రోజు ప్రధాని గగన్‌యాన్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను పరిచయం చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌తో సహా గ్రూప్ కెప్టెన్లు అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా పేర్లు ప్రకటించి, స్వయంగా ప్రధాని మోడీ అభినందించారు. నలుగురు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ఆధ్వర్యంలో యూరిగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు.
