NTV Telugu Site icon

Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: ‘‘ క్యాష్ ఫర్ క్వేరీ ’’ కేసులో మహువా మోయిత్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేందుకు అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారని, పార్లమెంట్‌లో అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. మహువా తన దగ్గర నుంచి గిఫ్టులు తీసుకున్నారని తెలిపారు.

Read Also: Manchu Manoj: అంబానీతో మంచు మనోజ్ దంపతులు.. పిక్ వైరల్

ఇదిలా ఉంటే ఈ కేసులో రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా హాజరుకాబోతున్నారు. తన పార్లమెంట్ లాగిన్ వివరాలను మోయిత్రా ఇతరులకు అందించిందని, దాంతో దుబాయ్ నుంచి వేరే వ్యక్తులు ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఇప్పటికే మహువాకు సంబంధించిన విదేశీ వ్యవహారాలు, కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు అందుకున్నట్లు సమచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన దాని ప్రకారం ఆమె తన పార్లమెంట్ అకౌంట్ దుబాయ్ నుంచి 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఎథిక్స్ కమిటీకి హాజరయ్యే ముందు రోజే ఈ వివరాలు వెల్లడయ్యాయి.

మోయిత్రా తను పార్లమెంట్ అకౌంట్ ద్వారా దర్శన్ హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన లాగిన్ వివరాలను స్నేహితుడైన హీరానందానీతో పంచుకున్నట్లు ఇప్పటికే మోయిత్రా ఒప్పుకున్నారు, అయితే తాను డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, మోయిత్రాపై ఆరోపణలు పెంచారు. హీరానందానీ స్థలం నుంచే 47 సార్లు లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ వార్తలు నిజమైతే దేశంలోని ఎంపీలంతా మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని, ఆమె హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగారని, పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహించారని ఎక్స్(ట్విట్టర్)లో మండిపడ్డారు.