Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైంది. గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో అధికారం చెలాయించిన మమతా బెనర్జీ, ఓడిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టుకోలేకపోతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే, తృణమూల్‌కు ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. తమదే అసలైన తృణమూల్ అని చెబుతున్నారు. ఇక ఎంపీల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్‌సభ ఎంపీల్లో 20 మంది రెబల్ వర్గంగా మారారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాలపై మమతా బెనర్జీ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా, మమత విధేయురాలు కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా, బహరంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పిలువగానే న్యూఢిల్లీకి వెళ్లినందుకు ఆయనపై విమర్శలు చేశారు. ‘‘ మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు లేదా, ధైర్యం చూపలేకపోయావా?’’ అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌కు ఆడిన రోజుల్ని గుర్తు చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌సభ ఎంపీలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత మోయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. తోటి ఎంపీలతో చర్చించిన తర్వాతే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా భవిష్యత్ రాజకీయ గమనం ఎన్డీయేకు అనుగుణంగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు ఆమె అన్నారు. టీఎంసీలోనే ఉంటూ ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ఎంపీలు ప్రకటించారు.

