NTV Telugu Site icon

Maharashtra CM Post: సీఎం ఎంపిక మరింత ఆలస్యం కానుందా? కారణమిదేనా..!

Maharashtracmpost

Maharashtracmpost

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది. నవంబర్ 23న విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 132 సీట్లు దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ పొత్తు ధర్మం కారణంగా సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంకో వైపు జార్ఖండ్‌లో మాత్రం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసేశారు. మహారాష్ట్ర పంచాయితీ మాత్రం సస్పెన్ష్ థిల్లర్‌గా సాగుతోంది. ఇక శుక్రవారం ముంబైలో మహాయుతి కూటమి సమావేశం జరగాల్సి ఉండగా.. హఠాత్తుగా రద్దైంది. దీంతో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో వేర్వేరుగా సమావేశమై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి గాను, శివసేన, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎంలు ఉండేలా ప్రతిపాదన వచ్చినట్లుగా సమాచారం. అలాగే బీజేపీకి 22, శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. అయితే ఈ ప్రతిపాదనకు షిండే మొగ్గు చూపలేదని తెలుస్తోంది. తన కుమారుడి భవిష్యత్‌ను పరిష్కరించాలని షిండే పట్టుబట్టినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా కీలకమైన హోంశాఖతో పాటు అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ మరియు మరికొన్ని కీలక పోర్ట్‌ఫోలియోలను శివసేన అడుగుతుంది. అయితే హోం శాఖను మాత్రం వదులుకోవడానికి బీజేపీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మహాయుతిలో తర్జన భర్జన జరుగుతోంది.

ఇదిలా ఉంటే రెండ్రోజులు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం డిసెంబర్ 2 గానీ, లేదంటే డిసెంబర్ 5న గానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోవాలంటూ షిండేను ఒప్పిస్తున్నారు. కానీ ఆయన పై నుంచి మెట్టు దిగేందుకు మనసు అంగీకారంగా లేనట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కాలం ఇప్పటికే ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అయితే రాష్ట్రపతి పాలన వస్తుందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. త్వరలోనే మహాయుతి ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ పెద్దలు అంటున్నారు.