NTV Telugu Site icon

Maharashtra: కేబినెట్ కూర్పుపై ఢిల్లీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ చర్చలు

Maharashtra Politics

Maharashtra Politics

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసిపోయింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరోవైపు రెండు పార్టీల సంక్షీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఇరు పార్టీల మధ్య కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను సమావేశం అయ్యారు సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ను కలిశారు వీరిద్దరు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీని వీరిద్దరు కలవనున్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణపై చర్చించారు. జేపీ నడ్డాతో దాదాపుగా 40 నిమిషాల పాటు సమావేశం అయిన షిండే, ఏక్ నాథ్ కేబినెట్ కూర్పుపై చర్చించారు. ప్రాథమిక చర్యల్లో షిండే వర్గానికి 11 మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ సూచింనట్లు సమాచారం. ఇక బీజేపీకి 29 మంత్రి పదవులు ఉండాలని చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. క్యాబినెట్‌ను రెండు దశల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు విస్తరణ జరగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మొత్తం 288 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీతో కలిపి 164 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

Read Also: CM Jagan: చిప్ వేలికి, కాళ్లకు ఉంటే సరిపోదు.. చినమెదడులో ఉండాలి

ఈ భేటీల అనంతరం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ… గతంలో నన్ను బీజేపీ సీఎంను చేసింది. ఇప్పుడు పార్టీ అవసరం మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండదే మా నాయకుడని.. ఆయన కింద పని చేస్తామని.. అన్యాయం పోయి మా సహజ మైత్రి మళ్లీ పుంజుకుంటుందని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని.. అప్పుడు మేము మాట్లాడలేకపోయామని.. అందుకే ఈ చర్య తీసుకున్నామని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. బీజేపీ, శివసేన సహజ కూటమి అని ఈ కూటమే మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు.