మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
సమావేశం నేపథ్యంలో మాతోశ్రీ ముందు పెద్ద ఎత్తున శివసేన కార్యకర్తలు గుమిగూడి, ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలు చోట్ల శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. వారి బ్యానర్లను చించేశారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు ఏదైనా అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. ముఖ్యంగా ముంబైలో హై అలెర్ట్ ప్రకటించారు.
మరోవైపు శివసేన తన పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చట్టపరమైన అభిప్రాయం కోరేందుకు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని అసెంబ్లీ సెక్రటేరియట్ పిలిచింది. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లవచ్చనే అంశంపై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే రేపు శివసేన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు సేన భవన్‌లో శివసేన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఉద్దవ్ ఠాక్రే పాల్గొగనున్నారు.