మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు, రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ పోటీపడగా నర్వేకర్ మెజారిటీ సాధించారు. స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో నర్వేకర్ 164 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికకు సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ దూరంగా ఉంది. ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ , రయీస్ షేక్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇదే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అయ్యారు.
Read Also: Konda Vishweshwar Reddy: నేడు బీజేపీలోకి చేవెళ్ల మాజీ ఎంపీ
అయితే స్పీకర్ ఎన్నిక సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త నాటకీయత చోటుచేసుకుంది. ఎన్నిక కోసం సభ్యుల లెక్కింపు సమయంలో ఈడీ..ఈడీ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తాజాగా స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గం స్పష్టమైన మెజారిటీని చూపింది. దీంతో రేపు జరగబోయే బలపరీక్షలో కూడా మెజారిటీ మార్క్ 144ను సీఎం ఏక్ నాథ్ షిండే ఖచ్చితంగా అధిగమించనున్నారు. 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు షిండే, బీజేపీ ప్రభుత్వానికి ఉంది.