NTV Telugu Site icon

Maharashtra Political Crisis: ముంబైలో హై అలర్ట్.. సెక్షన్ 144 విధింపు

Shivsena

Shivsena

మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 2/3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏక్  నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం శివసేన జిల్లా అధ్యక్షులతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అయిన తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పెద్ద సంఖ్యలో శివసైనికులు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళలకు పాల్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ముఖ్యంగా ముంబై మహానగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

తాజాగా శనివారం మహారాష్ట్రలోని చాలా చోట్ల శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ప్లెక్సీలు చింపివేయడంతో పాటు పలువురు రెబెల్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. థానేలోని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో ముంబై నగరంలో పోలీసులు సెక్షన్ 144 సీఆర్పీసీ విధించారు. వచ్చే నెల 10 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఆ రాష్ట్ర ఎన్సీపీ, శివసేన కార్యకర్తల నిరసనలు ఎదురవుతున్నాయి. హోటల్ వెలుపల వారంతా ఆందోళన చేస్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.