Site icon NTV Telugu

Maharashtra: అసోంకు చేరిన ‘మహా’ రాజకీయం.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?

Maharashtra Political Crisis

Maharashtra Political Crisis

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అక్కడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్​నాథ్​ శిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరంతా ఒకవేళ భాజపాలో చేరితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా .. మరో ఏడుగురు స్వతంత్రులు. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌కు తరలించారు. ఇప్పుడు ఆ బృందం అసోంకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

తనతో శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. తామంతా బాలా సాహెబ్‌ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోవైన్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారో తెలియదు. వారంతా కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఇక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇవాళ మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్‌ సమావేశం జరుగనుంది. భవిష్యత్‌ కార్యాచరణపై కీలక జరిగే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. అసమ్మతి ఎమ్మెల్యేల వద్దకు దూతను కూడా పంపినట్లు సమాచారం. ఏక్‌నాథ్‌ షిండేతో ఫోన్‌లో మాట్లాడినా సానుకూలత రాలేదు. మళ్లీ భాజపాతో శివసేన జత కట్టాలని ఉద్దవ్‌కు షిండే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉద్దవ్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288 కాగా శివసేన శాసన సభ్యులు ఒకరు ఇటీవల మరణించారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144 కాగా ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ సంఖ్యాబలం 152గా ఉంది. ప్రస్తుతం విపక్ష భాజపాకు 106 మంది సభ్యుల బలం ఉండగా.. స్వతంత్రులు, చిన్నపార్టీల మద్దతుతో తమకు 135 మంది సభ్యుల బలముందని కమలదళం చెబుతోంది.

షిండే కలిసివస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమని మహారాష్ట్ర భాజపా కూడా పేర్కొంది. ఈ తరుణంలో శివసేన కూడా మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముంబయిలోని వివిధ హోటళ్లలో తమ సభ్యులను ఉంచినట్లు శివసేన ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. మరోవైపు సూరత్‌లో ఉన్న షిండే వర్గం ఎమ్మెల్యేలు, స్వతంత్రులు రాత్రి ప్రత్యేక విమానంలో అసోంలోని గువాహటికి వెళ్లిపోయారు. షిండే వర్గానికి భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సహకరిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో షిండే ఇతర ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో బస చేసి, ఇవాళ తెల్లవారుజామున గౌహతి చేరుకున్నారు.

Exit mobile version