Maharashtra: మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని తెలిపారు. లేడీ హాన్ అని పిలవబడే ఈ పడవ ఆస్ట్రేలియన్ పౌరురాలైన హనా లాండర్‌గన్‌కు చెందినది. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ కెప్టెన్ అని ఫడ్నవీస్ చెప్పారు.
రాయ్‌గఢ్ తీరంలో మూడు ఏకే-47లను మోసుకెళ్తున్న పడవకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కోణం కనిపించలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అయితే, తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించామని ఆయన వెల్లడించారు. బోట్ ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో ఆ ఆస్ట్రేలియన్ దంపతులు బోటును వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీలేదని స్పష్టం చేశారు. అయితే, ఆస్ట్రేలియన్లు ఆ బోటులో ఆయుధాలు ఎందుకు తీసుకెళుతున్నారన్నది తెలియరాలేదని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ముంబై పోలీసులు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు.
Gotabaya Rajapaksa: అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న గొటబాయ.. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు!
ఐరోపా వెళ్తుండగా.. జూన్ 26న ఇంజిన్ చెడిపోయింది. అదే రోజున బోటులోని వారిని కొరియాకు చెందిన ఓ యుద్ధనౌక కాపాడింది. బోటును మాత్రం అక్కడే వదిలేశారు. అది అలల తాకిడికి మహారాష్ట్ర తీరం దిశగా కొట్టుకువచ్చింది. చివరికి హరిహరేశ్వర్ తీరానికి చేరుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. బోటులో తుపాకులను గుర్తించిన వెంటనే, ఉగ్రవాద భయంతో మహారాష్ట్ర తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఇందులో ఉగ్రకోణమేమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్‌గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. పెద్ద పండుగ అయిన జన్మాష్టమికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడం వల్ల భద్రతకు పెద్ద భయం కలుగుతోందని ఆమె అన్నారు.
