NTV Telugu Site icon

Maharashtra Elections 2024: మహాయుతి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం..

Maharashtra Elections 2024

Maharashtra Elections 2024

Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతోంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, గురువారం నాగ్‌పూర్‌లోని మహల్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ఫడ్నవీస్ సమావేశానికి గణనీయమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటర్లను ప్రభావితం చేసి, ఓటేసేలా చేసిన ఆర్ఎస్ఎస్‌కి ధన్యవాదాలు తెలిపేందుకు ఫడ్నవీస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని కలిసినట్లు తెలుస్తోంది.

2022లో జూన్‌లో శివసేనలో తిరుగుబాటు నేత షిండేని ముఖ్యమంత్రి చేసింది. ముందుగా ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా అనుకున్నప్పటికీ బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్‌కి చుక్కెదురైంది. అయితే, ఆ సమయంలో తాను ప్రభుత్వంలో చేరబోవడం లేదని చెప్పినప్పటికీ, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. షిండేని సీఎం చేస్తే ఉద్ధవ్ ఠాక్రే శివసేన కుదేలు అవుతుందని అంతా అనుకున్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఎంవీఏ ప్రభుత్వం పతనం తర్వాత ఫడ్నవీస్ సీఎం అయితే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేవని బీజేపీ భావిస్తోంది.

Read Also: Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. ప్రతి పక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్

‘‘మా పార్టీ కేంద్ర నాయకత్వం గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుంటుందనీ, ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం పదవికి సిఫారసు చేస్తుందని ఆశిస్తున్నాం. ఆయన ఇప్పటికే 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేశారు. అతను మంచి అడ్మినిస్ట్రేటర్’’ అని బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పదవికి పంకజా ముండే, చంద్రకాంత్ పాటిల్, వినోద్ తావ్డే వంటి మరికొందరు పోటీదారులు ఉన్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రమే పని చేయాలనే ఆసక్తి ఉన్న ఫడ్నవీస్‌కున్న రాజకీయ స్థాయి వీరిలో ఎవరికీ లేదు. సంప్రదాయబద్ధంగా మరాఠాలు బ్రహ్మన కులాన్ని నమ్మరు, ఇదే ఇక్కడ ఫడ్నవీస్‌కి మైనస్. అయితే, మరఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించడానికి చొరవ తీసుకున్నది ఫడ్నవీస్.

ఈ సారి లెక్కల్ని బీజేపీకి అనుకూలంగా ఉండటంతో పాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు 100+ సీట్లు సాధించే అవకాశం ఉండటంతో ఫడ్నవీస్ సీఎం పదవిని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ లెక్కలు పక్కదారి పట్టకుండా ప్లాన్ బీతో కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. మహాయుతి బలం తగ్గితే శరద్ పవార్ సాయం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే 250 కోట్ల బిల్ కాయిన్ కేసులో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే పేరు బయటకు వచ్చింది. ఇది రాజకీయంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండటం కూడా శరద్ పవార్ బీజేపీతో జత కట్టడానికి సహాకరించేలా చేస్తుందనేది అంచనా.