మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. 288 స్థానాలకు గాను 233 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా కూటమి పక్షాన నిలబడ్డారు. ఇక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ భారీ విజయంతో గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై కూడా పోటీ నెలకొంది. ఆదివారం బీజేపీ పెద్దలు ముంబై రానున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చనున్నారు.
ఇది కూడా చదవండి: BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కోప్రి-పచ్‌పఖాడి స్థానం నుంచి 1,20,717 ఓట్లతో విజయం సాధించారు. శివసేనలో చీలిక వచ్చిన తర్వాత బీజేపీతో చేతులు కలిపి షిండే సీఎం అయ్యారు. ఫలితాల గురించి షిండే మాట్లాడుతూ మహారాష్ట్ర మహిళలు మరియు రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారు. 39,710 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల వినోదరావు గూడాధేపై విజయం సాధించారు. ఇక బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్ పవార్ లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ నుంచి పోటీ చేసిన యోగేంద్రపై విజయం సాధించారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడే యోగేంద్ర. ఇదిలా ఉంటే ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ ఓటమి పాలయ్యారు. శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం విశేషం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అజిత్ పవార్ విక్టరీ సాధించారు. ఇక బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇది కూడా చదవండి: Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు