NTV Telugu Site icon

RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..

Rss

Rss

RSS: మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహిస్తే, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ మధ్య పోరు నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఇటీవల హర్యానాలో ఎన్నికల్లో గెలుపు మహారాష్ట్ర బీజేపీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందరి కన్నా ముందుగా బీజేపీ 99 మందితో తన తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ బీజేపీకి ఎలా కారణమైందో అందరికి తెలిసిన విషయమే. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు, ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసిన విధానం అక్కడ ఫలితాలనే మార్చేశాయి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఢంకా భజాయించి చెప్పినప్పటికీ, బీజేపీ మాత్రం ఘట విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 90 సీట్లలో 48 స్థానాలను బీజేపీ గెలవగా, కాంగ్రెస్ 37 స్థానాలు గెలిచి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది.

ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అండగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రంగంలోకి దిగింది. మహారాష్ట్ర ఆర్ఎస్ఎస్‌కి కంచుకోట లాంటిది. దాని ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో మహా ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందేందుకు, కూటమికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించేందుకు ఆర్ఎస్ఎస్ విస్తృతమైన ప్రచార కార్యక్రమాలనున ప్రారంభించింది. బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు ఇప్పటికే సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాయి.

Read Also: Bihar: సన్యాసిగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్..

ప్రతీ బృందం 5-10 మంది వ్యక్తులతో చిన్న సమూహ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతీ ఏరియాలో వారి నెట్వర్క్ స్థానిక కుటుంబాలను కలుసుకుంటోంది. జాతీయ ఆసక్తి, హిందుత్వం, సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం , సమాజానికి సంబంధించిన వివిధ స్థానిక సమస్యలపై సన్నిహిత చర్చల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని రూపొందించే పనిలో ఆర్ఎస్ఎస్ ఉంది. బృందాలను ఏర్పాటు చేయడానికి ముందు, ఆర్‌ఎస్‌ఎస్ మరియు దాని అనుబంధ సంస్థల ఆఫీస్ బేరర్లు రాష్ట్రంలోని అన్ని స్థాయిలలో వ్యూహాన్ని రూపొందించడానికి సమన్వయ సమావేశాలను నిర్వహించారని తెలుస్తోంది.

హర్యానా మ్యాజిక్.. మహారాష్ట్రలో కూడా..

హర్యానాలో ఆర్ఎస్ఎస్ చేసిన మ్యాజిక్‌నే మహారాష్ట్రలో చేయాలని భావిస్తోంది. హర్యానాలో సంఘ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల చిన్న గ్రూపు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా ‘‘జాట్ కేంద్రీకృత విధానాలు’’ గురించి మిగతా వర్గాల వారికి తెలియజేశారు. దీంతో ప్రజల అభిప్రాయాలను బీజేపీకి అనుకూలంగా మార్చారు.

గతేడాది బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య బంధం చెడిందనే వార్తలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ క్రియాశీలకంగా లేకపోవడంతోనే బీజేపీ సొంతగా మెజారిటీ మార్కును చేరలేక 240కి పరిమితమైందనే వాదన ఉంది. పార్లమెంటరీ ఎన్నికల సమయంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. మొదట్లో ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరమైందని, ఇప్పుడు బీజేపీ సొంతగా నడుస్తుందని చెప్పడం ఆర్ఎస్ఎస్‌లో ఆగ్రహానికి కారణమైంది. ఫలితంగా సంఘ్ కార్యకర్తలు ఆ ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేశారు.

ఆర్ఎస్ఎస్ కంచుకోటగా ఉన్న మహారాష్ట్రలో గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి అనూహ్యమైన దెబ్బ తగిలింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాని మిత్రపక్షాలు షిండే శివసేన 07, అజిత్ పవార్ ఎన్సీపీ 01 స్థానంలో విజయం సాధించాయి. మొత్తం 17 స్థానాలు మాత్రమే ఎన్డీయే కూటమిలోకి వెళ్లాయి. 2019 ఎన్ని్కల్లో బీజేపీ సొంతగా 23 స్థానాలు సాధించింది. 2019లో ఒక్కస్థానాన్ని గెలిచిన కాంగ్రెస్, ఈ సారి మాత్రం 13 స్థానాల్లో గెలిచింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 08 స్థానాల్లో గెలిచింది.

Show comments