Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్‌లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్‌కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్‌పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, కెకె రామకృష్ణన్‌లతో కూడిన మధురై ధర్మాసనం, సురక్షితమైన ఇంటర్నెట్ వాడకంపై, ముఖ్యంగా పిల్లలు, వారి తల్లిదండ్రులలో అవగాహన కల్పించే ప్రచారాన్ని వేగవంతం చేయాలని బాలల హక్కుల సంబంధిత అధికారులకు సూచించింది.
ఇంటర్నెట్ డివైజ్‌లలో పేరెంటల్ విండో ఉండటం వల్ల పిల్లలకు అందుబాటులో ఉండే అభ్యంతరకరమైన అశ్లీల మెటిరియల్ ముప్పును గణనీయంగా నియంత్రించవచ్చని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన చట్టాన్ని కూడా ఆ న్యాయవాది ప్రస్తావించారు. కేంద్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టుకు విన్నవించారు. యూజర్ స్థాయిలో నియంత్రణ ఉండాలని, డివైజ్‌లో పేరెంట్ కంట్రోల్ యాప్ అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
Read Also: Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారని, తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉందని న్యాయమూర్తులు నొక్కి చెప్పారు. పిటిషనర్ సూచనల్ని పరిగణలోకి తీసుకుంటూ.. ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని ఆమోదించే అవకాశాన్ని పరిశీలించాలని, చట్టం ఆమోదించే వరకు క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన అవగాహన తప్పనిసరి అని వారు చెప్పారు. పిల్లల అశ్లీలత ముప్పు గురించి మరింత అవగాహన కల్పించడానికి జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, తమిళనాడు బాలల హక్కుల రక్షణ కమిషన్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని అమలు చేస్తాయని ధర్మాసనం ఆశాభావం వ్యక్తి చేసింది.
16 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలించింది. గతేడాది ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా ఆమోదించింది. డిసెంబర్ 10 నుంచి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లకు సోషల్ మీడియాను నిషేధించింది. ఈ సంస్కరణలు ఆస్ట్రేలియాలో పిల్లల జీవితాలను మారుస్తాయని, వారి బాల్యాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. అయితే, యూట్యూబ్, మెటా వంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఈ నిషేధాన్ని ఖండించాయి. చాలా మంది టీనేజర్లు కూడా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు.
