Madhya Pradesh Janpad Panchayat Polls, BJP Big Win: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమలం వికసించింది. జన్ పద్ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీకి ఇది భారీ విజయం. 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ విజయం సాధించడం పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఫుల్ ఖుష్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోన 312 జన్ పద్ పంచాయతీలలో 226 స్థానాల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారని ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తాము 167 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందినట్లు ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు..దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా గెలిచిన అభ్యర్థులు తమ వారే అంటూ ప్రకటించుకోవడంతో ఎవరెన్ని పంచాయతీలు గెలుపొందారనే విషయంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మందసౌర్ జిల్లాలోని గరోత్ జనపద్ పంచాయతీ ఫలితం ఒక్కటే కోర్టు స్టే కారణంగా ప్రకటించలేదు. రెండు విడుతలుగా 143 జన్ పద్ పంచాయతీ మొదటి విడతగా.. 170 జన్ పద్ పంచాయతీలకు రెండో విడతగా ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 143 జన్‌పద్ పంచాయతీ బీజేపీ 102 స్థానాలను కైవసం చేసుకోగా.. 29 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థులు 5 పంచాయతీల్లో గెలుపొందగా.. స్వతంత్రులు 6 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక 170 పంచాయతీల్లో 124 పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంది.
Read Also: fighter Jet Crash: రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
బీజేపీ 226 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందడం చారిత్రాత్మక విజయం అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించలేదని.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 167 పంచాయతీలను గెలుచుకుంది. అయితే అధికార పార్టీ ధనబలం, పోలీసులను ఉపయోగించినా.. ప్రజలు ఒత్తడికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచారని పార్టీ కీలక నేత కమల్ నాథ్ అన్నారు. ఇదిలా ఉంటే కమల్ నాథ్ సొంత ప్రాంతం చింద్వారాలోని 11 జన్ పద్ పంచాయతీల్లో 6 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం విశేషం.