NTV Telugu Site icon

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..

Bjp, Congress

Bjp, Congress

Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగటున రూ. 10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని, ఇది 2013లో ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే సగటు రూ. 5.25 కోట్ల కన్నా 105 శాతం ఎక్కువ అని, 2008లో ఎన్నికైన ఎమ్మెల్యే సగటు రూ. 1.44 కోట్ల కన్నా 647 శాతం ఎక్కువ అని తెలిపింది.

నివేదిక ప్రకారం 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 107(83శాతం) మంది కోటీశ్వరులే కాగా.. 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 (78 శాతం) మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్య ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

Read Also: AUS vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ ఓపెనర్లు.. సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2008 ఎన్నికల్లో ఎన్నికైన కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్య 84గా ఉంటే 2013లో 161కి చేరింది. ఇది 92 శాతం ఎక్కువ. ఇక 2018లో 15.5 శాతం పెరిగి 186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా తేలింది. 2013లో అధికార బీజేపీలో 118 మంది కోటీశ్వరులు ఉంటే.. 2018 ఎన్నికల్లో 9 శాతం తగ్గి 107కు చేరుకుంది. 2013లో 40గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 2018లో 142 శాతం పెరిగి 97కి చేరుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన సంజయ్ పాఠక్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్‌కి 2013లో రూ. 141 కోట్ల ఆస్తులు ఉంటే, 2018లో 60 శాతం పెరిగి రూ. 226 కోట్లకు చేరింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ధనిక ఎమ్మెల్యేల జాబితాలో రూ.124 కోట్లతో ఆరోస్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు మాత్రం రూ. 7 కోట్లుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్ దంగోర్ కేవలం రూ. 50,000 ఆస్తులతో పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 97 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Show comments