L&T Chairman: ఇటీవల వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సాధారణ ప్రజలతో పాటు మిగతా పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం చెన్నైలో జరిగిన మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో శ్రీ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల వల్ల కార్మికులు అందుబాటులో ఉండటం లేదని, వారి కొరత ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు ఇది కొత్త చర్చకు దారి తీసింది.
ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండటం వల్ల కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని, నిర్మాణ రంగంలో కార్మికుల్ని పొందడం కష్టంగా మారిందని చెప్పారు. ఉపాధి హామీ, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, జన్ ధన్ ఖాతాలు వంటి పథకాలు కార్మికుల సమీకరణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ‘‘అవకాశాల కోసం కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బహుశా వారి స్థానిక ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండొచ్చు. బహుశా దీనికి వివిధ ప్రభుత్ పథకాలు కారణం కావచ్చు’’ అని అన్నారు. కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోందని చెప్పారు.
Read Also: PM Modi: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న మోడీ టూర్.. మార్సెయిల్‌లో భారతీయ సైనికులకు ప్రధాని నివాళి
భారత్ వలసల్లో విచిత్రమైన సమస్యల్ని ఎదుర్కుంటోందని, ఎల్ అండ్ టీకి 4 లక్షల మంది కార్మికుల అవసరం అయితే, ఉద్యోగులు ఎప్పుడు మానేస్తారో తెలియక 16 లక్షల మందిని నియమించుకున్నామని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కార్మికుల వేతనాలను సవరించాల్సిన అవసరాన్ని లేవనెత్తారు. మధ్యప్రాచ్యంలో కార్మికుల సంఖ్య భారత్ కన్నా మూడు నుంచి 3.5 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు.
గతంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆదివారాలు కూడా పనిచేయాలని కోరారు. ఇంట్లో కూర్చోని ఏం చేస్తారు..? ఎంత సేపు నీ భార్యను చూస్తూ ఉంటారు? ఆఫీసుకు వెళ్లి పనిచేయండి అని, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆనంద్ మహీంద్రా, అదార్ పూనావాలా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి వారు ఉత్పాదకత ముఖ్యమని ఎన్ని గంటలు పనిచేశామనే కాదని అన్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. మరోవైపు 70 లేదా 90 గంటలకు వర్క్ అవర్స్‌ని పెంచే అవకాశం లేదని ప్రభుత్వం గత వారం పార్లమెంట్‌కి తెలిపింది. వారానికి 60 గంటలకు పైగా పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వేలో కేంద్రం చెప్పింది.