All Party Meeting: జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్, వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఆర్‌ఎల్‌జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్, ఇతర పార్టీ ఎంపీలు హాజరయ్యారు. అయితే తెరాస మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని.. ఆమోదం కోసం 24 బిల్లులు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనుంది.పెండింగ్‌లో ఉన్న కొన్ని బిల్లుల్లో ఇండియన్ అంటార్కిటికా బిల్లు-2022 కూడా ఉంది. బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది.
అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు-2019 లోక్‌సభలో ఆమోదించబడింది. రాబోయే సెషన్‌లో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.సామూహిక విధ్వంసం యొక్క ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు-2022 లోక్‌సభలో ఆమోదించబడింది. ఇంకా రాజ్యసభ ఆమోదించలేదు. వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు-2021 లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. సముద్రపు పైరసీ నిరోధక బిల్లు-2019, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు-2021 కూడా లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నాయి.
TRS Parliamentary Party : ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో కొత్తగా ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లుల్లో సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు-2022 కూడా ఉన్నాయి.కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు-2022ను కూడా ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు మరికొన్ని బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయని ఓం బిర్లా తెలిపారు.త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. సభలో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షానికి తగినంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
