Site icon NTV Telugu

Delhi High Court: ‘‘ పరమశివుడికి మన రక్షణ అవసరం లేదు’’.. ఆలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పు..

Delhi High Court

Delhi High Court

Delhi High Court: యమునా నదీ ఒడ్డున అక్రమం నిర్మించిన శివాలయం కూల్చేవేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులోకి దేవుడిని తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది. యమునా నదదీ ఒడ్డున ఉన్న ఆలయాన్ని కూల్చివేసే ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని గురువారం హైకోర్టు కొట్టేసింది. ‘‘శివుడికి ఎవరి రక్షణ అవసరం లేదని’’ అని పేర్కొంది. నదీగర్భంలో అనధికార పద్ధతిలో ఆలయాన్ని నిర్మించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఆలయం వరద ప్రాంతాలకు సమీపంలోని గీతా కాలనీలో ఉంది.

ప్రజలంతా శివుడి ఆశీర్వాదాలు కోరుకుంటున్నామని, శివుడికి మన రక్షణ అవసరం లేదు, యమునా నదీతీరం, వరద మైదానాన్ని ఆక్రమించి ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తే దేవుడికి మరింత ప్రీతికరంగా, సంతోషకరంగా ఉంటుందని జస్టిస్ ధర్మేష్ శర్మ నేతతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ కేసులో పరమశివుడిని కూడా చేర్చాలని పిటిషనర్ తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేయడం, ఈ సమస్యకు భిన్నమైన రంగు పూయడానికి చేసే తీవ్రప్రయత్నం అవుతుందని కోర్టు మండిపడింది. నిత్యం వందలాది మంది భక్తులు ప్రార్థనలు చేసేందుకు వస్తున్నారని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ ఆలయం కేంద్రంగా ఉందని పిటిషనర్ వాదించారు.

Read Also: Andhra Pradesh: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను హ్యాండోవర్ చేసుకోనున్న జీఏడీ..

వివాదంలో ఉన్న భూమి పెద్ద ప్రజాప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందని, పిటిషనర్ సొసైటీ దానిని ఆక్రమించడం, ఉపయోగించడానికి ఎలాంటి స్వాధీన హక్కులను క్లెయిమ్ చేయదని కోర్టు చెప్పింది. పిటిషనర్ సొసైటీ భూమిపై తన హక్కు లేదా ఆసక్తిని రుజువు చేసే పత్రాలను సమర్పించడంలో విఫలమైందని చెబుతూ, ఈ మందిరానికి ఏదైనా ‘చారిత్రక ప్రాముఖ్యత’ ఉందని నిరూపించలేదని కోర్టు అంగీకరించింది. ఇది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆమోదించబడిన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ లోని జోన్-o లోకి వస్తుందని కోర్టు పేర్కొంది.

ప్రతీ రోజూ ఆలయంలో ప్రార్థనలు జరుగుతాయనేది, కొన్ని పండగ సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయనే వాస్తవం ప్రశ్నార్థకమైన ఆలయాన్ని ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మార్చడని చెప్పింది. పిటిషనర్ సొసైటీ 15 రోజుల లోపు ఆలయ విగ్రహానలు వేరే ఆలయంలో ఉంచడంలో విఫలమైనతే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) ఆ పనిచేయాలని కోర్టు ఆదేశించింది. అనధికార నిర్మాణాన్ని కూల్చేయడానికి డీడీఏకి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.

Exit mobile version