NTV Telugu Site icon

DMK Leader: శ్రీరాముడు ‘ద్రవిడ నమూనా’ని ముందుకు తీసుకెళ్లాడు.. డీఎంకే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..

Tamil Nadu Law Minister S Regupathy

Tamil Nadu Law Minister S Regupathy

DMK Leader: శ్రీరాముడిపై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే నేత, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రెగుపతి మాట్లాడుతూ.. శ్రీరాముడు ‘‘ద్రావిడ నమూనాకు ఆద్యుడు’’ అని అన్నారు. సోమవారం కంబన్ కజగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాముడు సామాజిక న్యాయ పరిరక్షకుడు అని ఆయన అన్నారు. “పెరియార్, అన్నాదురై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి కలైంజర్ (ఎం కరుణానిధి) కంటే ముందు ద్రవిడ నమూనాను ముందుకు తీసుకెళ్లిన సామాజిక న్యాయ పరిరక్షకుడు రాముడు. ప్రపంచానికి లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రబోధించిన ఏకైక వీరుడు రాముడు. అందరూ సమానమే అని చెప్పిన ఏకైక హీరో రాముడు.’’ అని ఆయన అన్నారు. భవిష్యత్తులో అసమానతలు లేని సమాజం ఏర్పడాలని రామాయణం ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. అవకాశం దొరికితే అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

Read Also: NEET: నీట్ రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

అయితే, మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. డీఎంకే ప్రభుత్వాన్ని రామరాజ్యంగా పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రామరాజ్యాన్ని డీఎంకే ప్రభుత్వం నడిపే ద్రవిడ ప్రభుత్వంతో పొల్చడం అసంబద్ధమని చెప్పింది. ‘‘డీఎంకే ద్రవిడ మోడల్ ప్రభుత్వం రామ రాజ్యం లాంటిది కాదు. డీఎంకే మోడల్ రావణుడి రాజ్యాన్ని పోలి ఉంటుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు పోరాడుతున్నామని చెప్పుకుంటున్న డీఎంకే పార్టీ తమ పాలనను రామరాజ్యంతో పోల్చడం హాస్యాస్పదంగానూ, నవ్వు తెప్పిస్తోంది.’’ అని ఒక ప్రకటనలో బీజేపీ విమర్శించింది. గతంలో మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ప్రస్తావించింది. 2023 చెన్నైలో జరిగిన ఓకార్యక్రమంలో సనాతనాన్ని డెంగీ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.