Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Amit Shah: వేసవి వేడిని తప్పించుకోవడానికే విదేశాలకు రాహుల్ గాంధీ..
ఆదివాసీలే రాముడిని లంకకు తీసుకెళ్లారని, కొంతమంది వానరసైన్యం అని రాశారు. నిజానికి వానరులు లేరని, వారు అడవుల్లో నివసించే ఆదివాసీలు అని ఆయన అన్నారు. హనుమంతుడు కూడా ఆదివాసీ అని, మనమంతా అతని వారసులం గర్వపడాలని సింఘార్ అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్ పాయ్.. ‘‘ వాళ్లు హనుమంతుడిని దేవుడిగా అంగీకరించరు, హిందువులు హనుమంతుడిని దేవుడిలా ఆరాధిస్తారని గుర్తించరు, వారు హనుమంతుడిని అవమానపరిచారు’’అని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ మాజీ క్యాబినెట్ మంత్రి కదా..? పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్నాడా..? హనుమంతుడిపై కాంగ్రెస్ ఆలోచన ఇదేనా..? కాంగ్రెస్ క్యాథలిక్ మతగురువుల భాష మాట్లాడుతోందని, మతమార్పిడులు చేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీలను ట్యాగ్ చేశారు హితేష్ బాజ్ పాయ్. అంతకుముందు కూడా గిరిజన కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా సియోని జిల్లాలో మాట్లాడుతూ.. కమల్ నాథ్ సమక్షంలోనే హనుమంతుడు ఆదివాసీ అని అన్నారు.
