Shivsena: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయనకు చెందిన శివసేన(యూబీటీ) ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. తాజాగా స్పీకర్ ఓం బిర్లా ఎంపీల విలీనానికి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ఏక్‌నాథ్ షిండే శివసేన ఎంపీల బలం మరింత పెరిగింది. తద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంఖ్యాబలం లోక్‌సభలో పెరుగుతోంది.
లోక్‌సభ స్పీకర్ నిర్ణయంతో లోక్‌సభలో ఉద్ధవ్ వర్గానికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండగా, షిండే శివసేనకు 13 మంది ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాలో దీనిని కీలక పరిణామంగా భావించాలి. ఉద్ధవ్ వర్గమే కాకుండా, ఇండియా కూటమి కూడా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇదే సమయంలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం విలీనం దిశగా చర్చలు జరుపుతున్నారు. విలీనం తర్వాత వీరంతా ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్ వర్గాలు మాత్రమే ఇండియా కూటమిలో మిగులుతాయి.

