Lok Sabha Election Phase 6: ఆరు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 58 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ నమోదు కాగా, ఢిల్లీలో 53.73 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ రోజు జరిగిన 6 ఫేజ్ ఎన్నికల్లో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇంద్రజిత్ సింగ్, బీజేపీకి చెందిన మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్ మరియు మనోజ్ తివారీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాశ్మీరీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌కి చెందిన కన్హయ్య కుమార్ పోటీ చేశారు. ఓటింగ్ దాదాపుగా ప్రశాంతంగా జరగగా, పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్, కంఠి నియోజకవర్గాల పరిధిలో అధికార తృణమూల్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఝార్‌గ్రామ్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
Read Also: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
ఆరో విడతలో హర్యానా (10), బీహార్ (8), జార్ఖండ్ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లీ (7), జమ్మూకశ్మీర్ (7) స్థానాలకు మొత్తంగా 58 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది. ఆరో దశ ముగిసే సమయానికి దేశంలోని మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన ఏడో దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ దశలో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆరో విడత రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం:
* బీహార్- 52.24
* హర్యానా -55.93
* జమ్మూ-కాశ్మీర్-51.35
* జార్ఖండ్- 61.41
* ఢిల్లీ -53.73
* ఒడిశా- 59.60
* ఉత్తరప్రదేశ్ – 52.02
* పశ్చిమ బెంగాల్- 77.99