Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 17 పార్టీలు విభేదాలను పక్కనపెట్టి అంతా కూటమిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ కూటమి పేరును PDA(పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయన్స్)గా పేరు పెట్టినట్లు సమాచారం. జూలై నెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో అధికారికంగా ఈ పేరును ప్రకటించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. బహిరంగంగా ప్రకటించలేదు.
Read Also: Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
శుక్రవారం పాట్నా వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేతర పార్టీలైన టీఎంసీ, ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీఎం, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు హాజరయ్యారు. జేడీయూ నుంచి సీఎం నితీష్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆప్ నుంచి భగవంత్ మన్, అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నుంచి సీనియర్ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడాలని అంగకీరించాయి. అయితే విధివిధానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. తదుపరి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సమావేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దొంగలంతా ఒకే చోటుకు చేరుతున్నారంటూ పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. పాట్నాలో ఫోటో సెషన్ జరిగిందిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేననే బహిరంగ రహస్యాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది.