Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది. ఇస్లామిక్ సిద్ధాంతాలు వివాహ సమయంలో సహజీవనాన్ని అనుమతించదని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు అవివాహితులై, మేజర్లు అయిన పక్షంలో తమ జీవితాలను తాము అనుకున్న విధంగా ఎంచుకునే హక్కు ఉందని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ ఏకే శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం బహ్రైన్ జిల్లాకు చెందిన పిటిషన్లు స్నేహాదేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్‌లకు పోలీసు రక్షణ కల్పించడానికి నిరాకరించింది.
అయితే, పిటిషనర్లు ఇద్దరూ తాము లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పిటిషన్లు తామిద్దరం పెద్దవాళ్లమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేందుకు తమకు స్వేచ్ఛ ఉందని పోలీసు రక్షణ కోరారు.
ఇదిలా ఉంటే విచారణలో, షాదాబ్ ఖాన్‌కి 2020లో ఫరీదా ఖాటూన్‌తో పెల్లైనట్లు తేలింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు కోర్టు గుర్తించింది. ఇస్లాం మతం అలాంటి సంబంధాన్ని అనుమతించదని, ముఖ్యంగా భార్య జీవించి ఉన్న సమయంలో అని పేర్కొంది. వివాహ విషయంలో రాజ్యాంగ నైతికత, సామాజిక నైతికత సమాతూకంగా ఉండాలని, లేని పక్షంలో సమాజంలో శాంతి, శాంతిని సాధించే సామాజిక సమన్వయం మసకబారుతుందని చెప్పింది. పిటిషనర్ స్నేహదేవీని భద్రతతో ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది.