NTV Telugu Site icon

AAP: “లిక్కర్ స్కామ్” టూ “శీష్ మహల్”.. ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..

Aap

Aap

AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్‌కి ఈ ఫలితాలు రుచించడం లేదు. ఇదే సమయంలో, దాదాపుగా 27 ఏళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది. అయితే, ఆప్ ఘోరపరాజయానికి అది చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆప్ ఓటమికి కారణాలు ఇవే:

ప్రభుత్వ వ్యతిరేకత:

2015, 2020లో గెలిచి వరసగా ఆప్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. విద్య , ఆరోగ్యం, విద్యుత్, నీటి సబ్సిడీలతో తన పదవీ కాలంలో ఓటర్లను సంతృప్తి పరిచింది. అయితే, రాజధానిలో గాలి నాణ్యత, యమునా కాలుష్యం ఢిల్లీ ఓటర్లలో ఆప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. కేంద్రంలోని బీజేపీ తమ ప్రభుత్వానికి పనిచేసేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పలుమార్లు కేజ్రీవాల్ ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో పాటు కేంద్రంలో బీజేపీ ఉండటం, ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా ఉండటంతో ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు.

శీష్ మహల్:

ఆప్‌తో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర వ్యతిరేకతకు ‘‘శీష్ మహల్’’ ఒక కారణమైంది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నివాసాన్ని కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ దీనిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాగ్ నివేదిక కూడా ఈ ఖర్చుల్ని తప్పుపట్టింది. భవనం పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా రూ. 7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే, 2020లో ఇది రూ. 8.62 కోట్లకు, 2022 నాటికి రూ. 33.66 కోట్లకు పెరిగింది. సాధారణ వ్యక్తిగా ఉంటానని ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేజ్రీవాల్ మరిచారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ విమర్శించింది.

లిక్కర్ స్కామ్:

ఢిల్లీలో ఆప్ ప్రతిష్టకు ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’’ భంగం కలిగించింది. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ ఈ కేసుని విచారించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి కీలక నేతలు జైలు పాలయ్యారు. ఢిల్లీని తాగుబోతుల నగరంగా మారుస్తుందని బీజేపీ, ఆప్‌పై విమర్శలు గుప్పించింది.