Lights Off Protest: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనతో అట్టుడికిపోతుంది. జూనియర్ డాక్టర్ హత్యాచార, హత్య ఘటనపై త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ‘ది బెంగాల్ జూనియర్ డాక్టర్ ఫ్రంట్’ నిరసనలకు పిలుపునివ్వడంతో బుధవారం రాత్రి వైద్యులు రోడ్డెక్కారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్ లైట్లతో భారీ ర్యాలీ తీశారు. దీంతో కోల్‌కతా మొత్తం చీకటిమయమైపోయింది. ఇక, రాత్రి 9 గంటలకు నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన విక్టోరియా మెమోరియల్, రాజ్ భవన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు జూనియన్ వైద్యురాలికి అండగా నిలిచారు. వీరితో పాటు గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంఘీభావం తెలిపేందుకు రాజ్‌భవన్‌లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నగర వీధుల్లోకి వచ్చారు.
Read Also: Georgia : జార్జియా స్కూల్‌లో కాల్పులు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
ఇక, కోల్‌కతాలో శ్యాంబాజార్, మౌలాలి, న్యూ టౌన్ బిస్వా బంగ్లా గేట్, రాష్‌బెహారీ క్రాసింగ్, బెహలా, గరియా, బల్లిగంజ్, హజ్రా క్రాసింగ్, జాదవ్‌పూర్ 8బీ బస్ స్టాండ్‌తో పాటు ప్రముఖ కూడళ్ల దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు. అలాగే, వాతావారణ కేంద్రం దగ్గర జరిగిన ఆందోళనలో అభయ తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. మరోవైపు, బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లైట్ దేర్ బి జస్టిస్.. లెట్ దేర్ బీ జస్టిస్ పేరుతో పిలుపునిచ్చిన ఆందోళనతో ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, ఎయిమ్స్ డాక్టర్లు క్యాండిల్ లైట్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. న్యాయం ఆలస్యం కాకుండా కేసును త్వరగా పరిష్కరించాలని వాళ్లు డిమాండ్ చేశారు. అలాగే, అభయ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 -సెప్టెంబర్ 2023 మధ్య ఆర్‌జీ కార్ ప్రిన్సిపల్‌గా పని చేసే టైంలో మృతదేహాలను అక్రమంగా అమ్మకంతో పాటు బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం స్టూడెంట్స్ దగ్గర లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.