సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’ అని అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా గవాయ్ ఏ మాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు. అనంతరం విచారణను యథావిధిగా కొనసాగించేశారు.
ఇది కూడా చదవండి: Bengaluru: జైల్లో గ్రాండ్‌గా ఖైదీ బర్త్ డే వేడుకలు.. వీడియో వైరల్
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతోంది. ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదిని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తుండగా న్యాయవాది ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’’ (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అంటూ అరుస్తూ కనిపించాడు. నిందితుడు వృద్ధ న్యాయవాది అయిన కిషోర్ రాకేష్‌గా గుర్తించారు. ఇతనికి ప్రాక్సిమిటీ కార్డు ఉన్నట్లుగా తెలిసింది.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!
వివాదాస్పదం..
ఇటీవల ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) కిందకు వస్తుందని, వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు క్షమించండి’’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐకి ఒక న్యాయవాది బహిరంగ లేఖ రాశారు. గవాయ్ చేసిన వ్యాఖ్యల్ని పున: పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐ చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. వినీత్ జిందాల్ అనే మరో న్యాయవాది రాష్ట్రపతికి ఈ విషయంపై లేఖ రాశారు. సుప్రీంకోర్టు భారతదేశంలోని ప్రతీ విశ్వాసాన్ని గౌరవించాలని కోరారు. శ్రీ విష్ణువు, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
