Kolkata Rape Case: కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్ లోపల 24 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం పశ్చిమ బెంగాల్‌ని కదిపేస్తోంది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచారం ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే, రాజకీయ రచ్చ మొదలైంది. బాధితురాలిపై అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్ నాయకుడిగా ఉన్నారు. మరో ఇద్దరు కూడా ఈ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గార్డు గదిలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నాలుగో వ్యక్తి సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో దాడికి సంబంధించిన పలు గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత మహిళ మెడపై గాయాలతో పాటు ఛాతిపై రాపిడి గుర్తులు ఉన్నట్లు వైద్య నివేదిక తెలియజేసింది. బాహ్య జననేంద్రియాలు, నోటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ వచ్చే వరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు. జూన్ 26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వైద్య పరీక్షల్లో భాగంగా యూరిన్ ప్రెగ్నె్న్సీ టెస్ట్ నిర్వహించారు. ఇది నెగిటివ్‌గా వచ్చింది.
బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, టీఎంసీ విద్యార్థి సమావేశం తర్వాత తనను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పింది. రాత్రి 7.30 గంటలకు ముగ్గురు నిందితులు తనను చుట్టుముట్టి దాడి చేసినట్లు చెప్పింది. ప్రధాన నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. కాళ్లుపట్టుకుని వేడుకున్నా వినలేదని, తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పటికీ దాడిని కొనసాగించినట్లు చెప్పింది. బలవంతంగా బట్టలు విప్పించి తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది. దాడి గురించి బయటపెడితే బాయ్‌ఫ్రెండ్‌తో పాటు కుటుంబాన్ని చంపేస్తామని నిందితులు బెదిరించారు.
