Site icon NTV Telugu

AAP: వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతాం.. మెగా ర్యాలీ ముందు కీలక వ్యాఖ్యలు..

Aap

Aap

AAP: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read Also: Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మరో సాయం!

‘‘ఇండియా కూటమి ఒకటిగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగిన సమయంలో కాంగ్రెస్ కీలక నేతలు ఇక్కడ ఉన్నారు. కూటమి నాయకులంతా ఈ అరెస్టును ఖండించారు’’అని అతిషి అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంపై చివరి దాడి అని, దీనికి వ్యతిరేకంగా రేపు ప్రతిపక్షాలన్ని తమ గొంతు వినిపించబోతున్నాయని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో సహా ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగే ‘మహా ర్యాలీ’కి హాజరవుతున్నారు.

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు గతవారం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 1 వరకు అతడిని కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పంజాబ్, గోవా ఆప్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆప్ కీలక నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి వారు జైలులో ఉన్నారు.

Exit mobile version