Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 నిషేధానికి తెర.. కారణం ఇదే..

  • లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.
  • 47 ఏళ్ల మద్యం నిషేధానికి ముగింపు.
  • కొత్త ఎక్సైజ్ నిబంధనలతో లైసెన్స్ ఆధారిత విక్రయాలకు అనుమతి.
  • పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కేంద్రం ప్రధాన లక్ష్యం.
Lakshadweep

Lakshadweep

Lakshadweep: కేంద్రపాలిత ప్రాంతం, ముస్లిం మెజారిటీ ఉన్న లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 47 ఏళ్లగా ఉన్న నిషేధానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకువచ్చింది. నియంత్రిత విధానంలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఈ చర్య లక్షద్వీప్ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఏడాది క్రితం లక్షద్వీప్ సందర్శనకు ప్రధాని మోడీ వెళ్లిన తర్వాత, ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్లడం ఎక్కువైంది.

1973 నుంచి నిషేధం, ఎందుకు..?

1973 నుంచి లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. అప్పటి నుంచి అమలులో ఉన్న ‘‘లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్’’ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేుసింది. దీని స్థానంలో కొత్తగా ‘‘ లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్ -2026’’ను అమలులోకి తెచ్చింది. జూన్ 5 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త చట్టం ప్రకారం.. మద్యం తయారీ, స్వాధీనం, దిగుమతి, ఎగుమతి, రవాణా, కొనుగోలు, అమ్మకం,వినియోగాన్ని నియంత్రించే లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు మరియు ఏజెన్సీలు మద్యం దిగుమతి, రిటైలింగ్ కోసం లైసెన్సులు పొందేందుకు కూడా అనుమతిస్తుంది.

×
×
Ad

లక్షద్వీప్ జనాభాలో సుమారు 97 శాతం మంది ముస్లింలే. ఇస్లా్ంలో మద్యం సేవించడం నిషేధం. దీంతో 1979లో మద్య విక్రయాల నిషేధం అమలులోకి వచ్చింది. దశాబ్ధాలుగా అక్కడి రాజకీయ పార్టీలు, పలు సంస్థలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. అయితే, కవరత్తి, బంగారం ద్వీపాల్లోని కొన్ని పర్యాటక రిసార్టులు, ప్రభుత్వ నిర్వహణ బార్లలో మినహాయింపు ఉండేది.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఎత్తివేత:

లక్షద్వీప్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరో మాల్దీవులుగా దీనిని తీర్చిదిద్దాలనుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ 2024 లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. 2020లో కేవలం 3875 మంది పర్యాటకులు మాత్రమే వెళ్తే, 2024 నాటికి ఈ సంఖ్య 68 వేలకు చేరింది.

భారీ పన్నులు..

నియంత్రిత విధానంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, పన్నులు మాత్రం భారీగా ఉన్నాయి. . ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) మరియు విదేశీ మద్యంపై 400%, బీర్‌పై 200%, వైన్‌పై 80% ఎక్సైజ్ సుంకాలను నిర్ణయించారు.

లక్షద్వీప్ గురించి..

లక్షద్వీప్ 36 ద్వీపాల సమూహం. వాటిలో అగట్టి, అమిని, ఆండ్రోట్, బిట్రా, చెట్లట్, కడ్మత్, కల్పేని, కవరట్టి, కిల్తాన్ మరియు మినీకాయ్‌తో సహా 10 ద్వీపాలలో జనావాసం ఉంది. విదేశీయులు, భారతీయ పర్యాటకులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులు కేవలం అగట్టి, బంగారం, కడ్మత్ ద్వీపాల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ 36 ద్వీపాల్లో 10 ద్వీపాల్లో ప్రజలు ఉంటే, మరో 17 దీవుల్లో జనావాసాలు లేవు. కొత్తగా మరో 4 చిన్న దీవులు ఏర్పడ్డాయి.