NTV Telugu Site icon

BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Bjp

Bjp

BJP: ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ సారి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని దింపేయాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ ఓటర్ల సెంటిమెంట్ రిపీట్ చేస్తారని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్ లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఇది తమకు కలిసి వస్తోందని బీజేపీ అనుకుంటోంది.

ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. మంగళవారం రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ..‘‘ మొత్తం దేశంతో పాటు పాకిస్తాన్ కూడా రాజస్థాన్ ఎన్నికలపై కన్నేసింది. లాహోర్ టోంక్ సీటుపై కన్ను వేసింది’’అని అన్నారు.

Read Also: Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి టోంక్ లోని ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నారని దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. లాహోర్ ఎన్నికలపై నిఘా ఉంచింది, ఎన్నికల తర్వాత లాహోర్ లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు టోంక్ నియోజకవర్గానికి రమేష్ బిధూరిని ఇంఛార్జిగా నియమించింది. బిధూరి తన రాజకీయ వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. గత పార్లమెంట్ సెషన్ లో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.