NTV Telugu Site icon

Lady Macbeth of Bengal: సీఎం మమతాని ‘సామాజిక బహిష్కరణ’ చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రమాణం..

Mamatha

Mamatha

Lady Macbeth of Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘లేడీ మాక్‌బెత్ ఆఫ్ బెంగాల్’ అంటూ సీఎం మమతాని ఆయన పిలిచారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బాధ్యురాలిని చేస్తూ బెనర్జీని “సామాజికంగా బహిష్కరిస్తాను” అని తెలిపారు.. అలాగే, ఆమెతో తాను ఇకపై బహిరంగ వేదికను పంచుకోనని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ లేడీ మక్‌బెత్ హూగ్లీ జలాలను పట్టుకుంది.. కానీ కళంకిత చేతులను శుభ్రం చేయలేకపోతోంది అని విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రిపై క్రియాశీలక చర్యలు తీసుకుంటాను.. గవర్నర్‌గా నా పాత్ర రాజ్యాంగ బాధ్యతలకే పరిమితం అవుతుంది అని సీవీ ఆనంద్ బోస్ అన్నారు.

Read Also: BRS Meeting: నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..

ఇక, హత్యాచారం-హత్యకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.. మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇవి జరిగాయని.. న్యాయం కోసం “తన పదవికీ రాజీనామా చేసేందుకు అయినా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పుకొచ్చింది. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే తాను నిష్క్రమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే, బీజేపీకి మాత్రం న్యాయం వద్దు.. కేవలం కుర్చీ మాత్రమే కావాలి అని ఆమె అన్నారు. కాగా, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ ఆనంద్ బోస్ చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగవని పేర్కొన్నారు. గవర్నర్ కుర్చీలో కూర్చొని ఇలాంటి ప్రకటనలు చేయొద్దు.. ముఖ్యమంత్రిని బహిష్కరించడం అంటే ఏంటి? అని ప్రశ్నించారు.

Show comments