NTV Telugu Site icon

Jaya Bachchan: నదిలోకి శవాలు, కుంభమేళా నీరు అత్యంత కలుషితం: ఎస్పీ ఎంపీ జయా బచ్చన్..

Jaya Bachchan

Jaya Bachchan

Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సామాన్య ప్రజల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. ‘‘ ప్రస్తుతం ఎక్కడ నీరు కలుషితమైందంటే, అది మహా కుంభమేళాలో ఉంది. తొక్కిసలాటలో మరణించిన మృతదేహాలను నదిలో పారేయడం వల్ల నీరు కలుషితమైంది. అసలు సమస్యని పరిష్కరించడం లేదు. కుంభ్‌కి వచ్చే సామాన్య ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. వారి కోసం ఏర్పాట్లు చేయలేదు’’ అని పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.

Read Also: Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్‌చల్.. యమునా నీళ్లతో నిరసన

మృతదేహాలకు పోస్టుమార్టం జరలేదు, జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణిస్తే, 60 మంది గాయపడ్డారు. కంటితుడుపు చర్యలకే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు. బీజేపీ వారు నీరు, జలశక్తి గురించి ప్రసంగాలు చేస్తున్నారు, కోట్లాడి మంది ప్రజలు ఆ ప్రదేశాన్ని సందర్శించాలని అబద్ధాలు చెబుతున్నారని, ఆ ప్రదేశంలో అంతపెద్ద సంఖ్యలో ప్రజలు ఎలా గుమిగూడగరు..? అని ప్రశ్నించారు.

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం మృతుల సంఖ్యని దాచిపెడుతోందని ఎస్పీతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేశాయి. జనవరి 29న తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు సంగమ ప్రాంతం వద్దకు చేరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం జ్యుడిషీయల్ ఎంక్వైరీకి ఆదేశించింది.