కర్ణాటకలో వివాదాలకు కొదువే లేదు. కర్ణాటకలో జరిగే ఏదో ఒక అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. అక్కడి నేతలు కూడా ఎప్పుడూ ఏదో కాాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ జెండా ఏదో ఒక రోజు జాతీయ జెండా అవుతుందనడంలో సందేహమే లేదని ఆయన అన్నార. కాషాయంపై గౌరవం అనేది ఈ రోజుది కాదని వేల ఏళ్ల నుంచి గౌరవించబడుతోందని ఆయన అన్నారు. కాషాయం త్యాగానికి సంకేతం అని.. త్యాగ భావాన్ని వెలికి తీసేందుకు ఆర్ఎస్ఎస్ ముందు భాగంలో కాషాయ జెండాను ఉంచి ప్రార్థన చేస్తుందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం త్రివర్ణ పతాకమే దేశ జెండా.. దానికి గౌరవం ఇస్తామని అన్నారు. గతంలో కూడా ఈయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 36 వేల దేవాలయాలను కూల్చి మసీదులుగా మార్చారని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య బీఫ్ పై కామెంట్స్ చేశారు. తాను హిందువు అయినా బీఫ్ తింటానని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక గత కొంత కాలం నుంచి కర్ణాటకలో హిజాబ్ వివాదం నడుస్తూనే ఉంది. కర్ణాటక హైకోర్ట్ విద్యాసంస్థల్లోకి హిజాబ్ అనుమతిని వ్యతిరేఖిస్తూ తీర్పు చెప్పింది. అయిన మళ్లీ ఈ వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే మాండ్యాలోని జామియా మసీదు, మంగళూర్ లోని జుమా మసీదు ఒకప్పుడు హిందూ ఆలయాలే అని అక్కడి హిందూ సంస్థలు ఆరోపించడం ఇలా కర్ణాటకలో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.