Kiren Rijiju: లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు

  • లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ
  • పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
  • పౌరులు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని పిలుపు
Kiren Rijiju

Kiren Rijiju

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దాదాపు అన్ని దేశాలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

తాజాగా ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే లాక్‌డౌన్‌పై కూడా స్పందించారు. లాక్‌డౌన్ లేదు.. కానీ భారత్ మాత్రం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని.. లాక్‌డౌన్ వంటి పరిస్థితులు రావని స్పష్టం చేశారు. అయితే ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ ముందస్తుగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఓ జాతీయ మీడియాతో కిరణ్ రిజిజు మాట్లాడారు.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు, వాణిజ్య మార్గాలపై ప్రభావం పడుతోందని చెప్పారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభాన్ని భారత్ సృష్టించలేదు. కానీ పరిస్థితులు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. బయట జరిగే పరిణామాలపై ఆధారపడకుండా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రధాని ఇంధనాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు.’’ అని తెలిపారు.

గత 12 ఏళ్లుగా దేశీయ ఉత్పత్తి పెంపు, ఇంధన పొదుపు కోసం ప్రధాని మోడీ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ‘‘ఇప్పటికీ భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. చుట్టూ సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పుడు నాయకుడి మాట వినాలి. ఇది సాధారణ సమయం కాదు.’’ అని అన్నారు.

ఈ సమయంలో రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని కిరణ్ రిజిజు సూచించారు. ‘‘సంక్షోభ సమయంలో దేశం నాయకుడి వెంటే నిలబడాలి. సాధారణ సమయాల్లో రాజకీయాలు చేయొచ్చు. కానీ క్లిష్ట సమయంలో అందరి మద్దతు అవసరం. ప్రతిపక్షాలు కూడా దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి తోడుగా నిలవాలి.’’ అని పేర్కొన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ‘‘మేమంతా మా ఖర్చులను తగ్గించుకున్నాం. మంత్రిత్వ శాఖలకు 50 శాతం కంటే ఎక్కువ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సూచించాం. అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ పర్యటనలను కూడా తగ్గిస్తున్నాం.’’ అని వెల్లడించారు.

లాక్‌డౌన్..
దేశంలో అత్యవసర పరిస్థితి లేదా లాక్‌డౌన్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించారు. ‘‘లాక్‌డౌన్ లేదు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ఎవరూ ప్రచారం చేయకూడదు. భారత్ ప్రస్తుతం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనడం లేదు. కానీ ముందస్తుగా సిద్ధంగా ఉండటం మంచిదే.’’ అని స్పష్టం చేశారు.