Site icon NTV Telugu

Mallikarjun Kharge: మోడీ ఎప్పుడైనా టీ చేశారా.. ఓట్ల కోసమే ‘‘చాయ్‌వాలా’’గా చెప్పుకున్నారు..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: రాజకీయ దుమారానికి కారణమయ్యే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఓట్ల కోసమే తనను తాను ‘‘చాయ్‌వాలా’’గా చెప్పుకున్నారని ఆరోపించారు. ‘‘ఓట్ల కోసం నేను టీ అమ్మేవాడిని అని చెబుతుంటారు. ఆయన ఎప్పుడైనా టీ చేశారా.? ఎప్పుడైనా కెటిల్ పట్టుకుని ప్రజలకు టీ అందించారా.? ఇదంతా ఒక నాటకం. పేదలను అణచివేయడం ఒక అలవాటు’’ అని ఖర్గే అన్నారు. యూపీఏ హయాంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో బీజేపీ ప్రభుత్వం జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడంపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. ఈ కార్యక్రమంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రచారాంలో బిజీగా ఉందని ఆయన అన్నారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇన్ని పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చారని, బీజేపీ చేసిన ఒక్క పని చెప్పండి అంటూ ఖర్గే అడిగారు.

Read Also: Ramdas Athawale: ఆ పని చేస్తే ఎక్కువ నిధులు ఇస్తాం.. సీఎం పినరయి విజయన్‌కు ఎన్డీయే ఆఫర్..

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత టామ్ వడక్కన్ మాట్లాడుతూ.. ప్రధాని ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చారనేది వాస్తవం, ఈ విషయాన్ని కాదనలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సిల్వర్ స్పూన్‌తో పుట్టిన వారసత్వ నాయకులు ఉన్నారని, వారు పొందిన హక్కులను వారు కాదనగలరా? , కాంగ్రెస్ సత్యంపై నిలబడదని అన్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కామ్‌దార్ ప్రధాని అయితే, నామ్ దార్ కాంగ్రెస్ సహించదని బీజేపీ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా విమర్శించారు. కాంగ్రెస్ గతంలో ప్రధాని చాయ్‌వాలా నేపథ్యాన్ని ఎగతాళి చేస్తూ 150 సార్లు తిట్టారని, వారిని ప్రజలు క్షమించరని అన్నారు.

గుజరాత్ వాద్‌నగర్ స్టేషన్‌లో తన తండ్రి టీ స్టాల్ నడిపేవాడని, తాను చిన్నప్పుడు తనకు సాయం చేశానని ప్రధాని మోడీ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజవంశస్తులు అని బీజేపీ తరుచు ఎగతాళి చేస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. మోడీని ఎగతాళి చేస్తూ, ఆయనకు ఎప్పటికీ ప్రధాని కాలేరని, ఒక చాయ్‌వాలా ప్రధాని పదవికి అనర్హుడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రధానిగా మోడీ మూడోసారి అధికారంలో ఉన్నారు.

Exit mobile version