ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె మరోసారి ఫైరయ్యారు. మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ” కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపుతారు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఖర్గె శనివారం మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నార విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ప్రకారం అన్నింటినీ రక్షిస్తామని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ..తాము గత 17 నెలల్లో చేసింది. గత 17 ఏళ్లలో ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వాళ్లు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేశారని ఆరోపించారు. బీహార్‌లో విద్యుత్తు చాలా ఖరీదైందని, మేం అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని హామీ ఇచ్చారు. 10 కేజీల బియ్యం కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.
READ MORE: Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వచ్చేసింది..
ఇటీవల ఇండియా కూటమికి మమతా బెనర్జీ బయటి నుంచి మద్దతు తెలుపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. బయటి నుంచి సపోర్టు ఇస్తామని తొలుత మమత చెప్పిందని, ఇండియా కూటమి ఏర్పడితే అప్పుడు ప్రభుత్వంలో కలుస్తామని ఆమె ఇటీవల పేర్కొన్నట్లు ఖర్గే తెలిపారు. కాబట్టి ఆమె తమతోనే ఉన్నట్లు వెల్లడించారు. మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరీని ఖర్గే తప్పుపట్టారు. కాగా.. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించారు. తాము మరోసారి మమత మాటలు నమ్మే పరిస్థితిలో లేమని.. ఆమె మాటలపై నమ్మకం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఖర్గె తప్పుపట్టారు.