NTV Telugu Site icon

Khalistan: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “ఖలిస్తాన్”

Khalistan

Khalistan

“Khalistan” trending on Twitter: ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ అనుచరులు, బాడీగార్డులను కలుపుకుని 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ అంతటా ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు.

ఇదిలా ఉంటే ట్విట్టర్ లో ‘‘ఖలిస్తాన్’’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అమృత్ పాల్ సింగ్ నిజమైన సిక్కు కాదని, అతడు పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైన్డ్ ఏజెంట్ అని పలువురు నెటిజెన్లు ట్వీట్స్ చేస్తున్నారు. పలువురు సిక్కులు తాము ఖలిస్తాన్ కోరుకోవడం లేదని చెబుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు.

మరికొంత మంది పోలీసులు ఏం చేస్తారో చేసుకోండి ఛాలెంజ్ చేసిన అమృత్ పాల్ సింగ్ ఇప్పుడు పారిపోయాడంటూ సెటైర్లు వేస్తున్నారు. పంజాబ్ ప్రజలు పంజాబ్ పోలీసులను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఖలిస్తానీ అనే ఆలోచన భయంకరమైనదని, ఇది సిక్కులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పలువురు సిక్కు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది హిందూ అతివాదుల నుంచి సిక్కులను రక్షిస్తున్నాడని అమృత్ పాల్ సింగ్ ను హీరోగా పొగుడుతూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు.

పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్ లో అశాంతిని పెంచేందుకు అమృత్ పాల్ సింగ్ వంటి వారికి డబ్బులు ఇచ్చి మరీ ఖలిస్తాన్ పేరిట యువతను రెచ్చగొడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లో ఉండే కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు పంజాబ్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో నిర్వహించిన ఖలిస్తాన్ రిఫరెండం గురించి పోస్టులు చేశారు.