Kerala Replacing Punjab As Capital Of Drugs Governor says Governer Arif Mohammed Khan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ క్యాపిటల్ గా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కేరళ అధిగమిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్రానికి కేవలం మద్యం, లాటరీలే ఆదాయవనరులుగా ఉండటాన్ని చూసి సిగ్గుపడుతున్నానని శనివారం ఆయన అన్నారు. మద్యం వినియోగానికి అందరూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే కేరళ మాత్రం దీనిని ప్రోత్సహిస్తోందని లెఫ్ట్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై ప్రభుత్వంతో విభేదిస్తున్నారు ఆయన. దీంతో గవర్నర్, అక్కడి ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడుతోంది.
కోచ్చిలో జరిగిన ఓ పుస్కకావిష్కరణలో పాల్గొన్న ఆయన రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ రాష్ట్రానికి మద్యం, లాటరీలు మాత్రమే అభివృద్ధికి సహకరిస్తాయని నిర్ణయించుకున్నామని.. 100 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రానికి ఇది అవమానకరస్థితి అని ఆయన అన్నారు. రాష్ట్ర అధినేతగా దీనికి నేను సిగ్గుపడుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ప్రజలను మద్యానికి బానిసలు చేస్తున్నారని, పేద ప్రజలే లాటరీలను కొనుగోలు చేస్తున్నారని.. వీరిని మీరు దోచుకుంటున్నారని సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కేరళలోని వివిధ విశ్వవిద్యాలయాలలకు వైస్ ఛాన్సరల్ల నియామకం అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. వైస్ ఛాన్సలర్ నియామకం గవర్నర్ బాధ్యతే అని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. అందులో ప్రభుత్వం పాత్ర ఉండదని.. ఏదైనా చట్టం చేస్తే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు లోబడి ఉండాలని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన గవర్నర్, కేరళలోని విద్యావ్యవస్థను అర్థం చేసుకోగలరా..? అని ప్రశ్నించిన మంత్రికి కౌంటర్ ఇచ్చారు గవర్నర్. నిన్న సుప్రీంకోర్టు కేరళ టెక్నికల్ యూనివర్సిటీ వీసీ నియామకానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. తీర్పు చెప్పిన న్యాయమూర్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మంత్రికి స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు. తిరువనంతపురంలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకం చట్టపరంగా జరగలేదని..యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం దానిని రద్దు చేసింది.