Site icon NTV Telugu

Kerala: వివాదంలో యూత్ ఫెస్టివల్ సాంగ్.. విచారణకు కేరళ ప్రభుత్వం ఆదేశం..

Kerala

Kerala

Kerala orders probe into row over youth fest theme song: కేరళలో యూత్ ఫెస్టివ్ సాంగ్, డ్యాన్స్ స్కిట్ వివాదాస్పదం అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార లెఫ్ట్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ పాట, డ్యాన్స్ స్కిట్ ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పినరయి విజయన్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇటీవల కోజికోడ్ లో జరిగిన యూత్ ఫెస్టివల్ స్వాగత గీతం, డ్యాన్స్ స్కిట్ లో భాగంగా దేశభక్తి, లౌకికవాదం, ఐక్యత, బలగాల పోరాట స్ఫూర్తిని వర్ణించే విధంగా ఓ సాంగ్ పై ప్రదర్శన ఇచ్చారు. ఇందులో భారత ఆర్మీ జవాన్ ఓ చొరబాటుదారుడిని పట్టుకుంటాడు. అయితే చొరబాటుదారుడు సంప్రదాయ ముస్లిం దుస్తులు ధరించి ఉండటంతో వివాదం రాజుకుంది.

Read Also: RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి మాట్లాడుతూ.. దీనిపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ని ఆదేశించినట్లు వెల్లడించారు. కోజికోడ్‌లోని మాత కళా కేంద్రం అనే స్కిట్ నిర్వాహకులను విద్యాశాఖ అన్ని కార్యక్రమాాల నుంచి నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ మిత్రపక్షం అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. చొరబాటు ఉగ్రవాదికి ముస్లింల సంప్రదాయ దుస్తులు ఉండటం విచారకరం అని.. ఇది తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని పార్టీ నేత పికె కున్హాలికుట్టి అన్నారు.

దేశంలో నిర్థిష్ట వర్గాన్ని తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని.. సంఘ్ పరివార్ భావజాలాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీపీఎం ఆరోపిస్తోంది. జనవరి 3-7 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లెఫ్ట్ ప్రభుత్వం ఇలాంటివి చేయడంలో ఆర్ఎస్ఎస్ ను మించిపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఉగ్రవాదికి దేశభక్తి ముసుగు వేయాలని కాంగ్రెస్, సీపీఎం, ముస్లిం లీగ్ కోరుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది.

Exit mobile version