Kerala doctor Suicide: వరకట్న వివాదం ఓ మహిళా వైద్యురాలి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. షహానా అనే యువతి తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిగా ఉంది. వరకట్నం ఇవ్వలేదని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అద్దె అపార్ట్మెంట్‌లో శవమై కనిపించింది. యువతి కుటుంబం వరకట్నం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని, ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపించారు.
Read Also: Revanth reddy Speech: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం..
పెళ్లి చేసుకోవాలంటే బంగారం, భూమి, BMW కారుని కట్నంగా ఇవ్వాలని షహానా బాయ్‌ఫ్రెండ్ కుటుంబం డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్నాడు. కట్నం వివాదంలో వీరిద్దరి మధ్య రిలేషన్ ముగిసింది. మిడిల్ ఈస్ట్‌లో పనిచేస్తున్న షహానా తండ్రి ఇటీవల మరణించారు.
వరకట్నం డిమాండ్ చేస్తున్న కుటుంబంతో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవడం షహానా అన్న జాసిమ్ నాస్‌కి ఇష్టం లేదు. షహానా ఆనందం కోసమే అతను పెళ్లికి ఒప్పుకున్నారు. షహానా ప్రియుడు డాక్టర్ రువైస్ కట్నం కింద ఏకంగా 150 తులాల బంగారం, బీఎండబ్ల్యూ కార్, 15 ఎకరాల భూమిని కట్నంగా కోరాడు. అయితే షహాన కుటుంబం ఆ డిమాండ్లను నెరవేర్చలేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. రువైస్, షహానా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే కట్నం విషయంలో మాత్రం అతడు యువతికి అండగా నిలబడలేదు. దీంతో పెళ్లి క్యాన్సల్ అయింది. ఆమె మత్తుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక అందించాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖను ఆదేశించింది. కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సతీదేవీ బుదవారం షహానా తల్లిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత వైద్యురాలి నుంచి వైద్యుడి కుటుంబం వరకట్నం డిమాండ్ చేసినట్లు తేలితే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తామని సతీదేవీ తెలిపారు. మరోవైపు రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్, సదరు వ్యక్తిని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది.