Kerala court orders police to book CPI(M) MLA Jaleel over ‘Azad Kashmir’ remark: జమ్మూా కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని అక్కడి కోర్టు పోలీసులను ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని‘ ఇండియా ఆక్రమిత కాశ్మీర్ ’ అంటూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కేటీ జలీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై కేరళ పతనంతిట్ట జిల్లాలోని సెషన్స్ కోర్ట్ ఆయన మీద కేసు పెట్టాలని ఆదేశించింది. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ‘ ఆజాద్ కాశ్మీర్ ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జలీల్ పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ పతనంతిట్ట అధ్యక్షడు అరణ్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు చర్యలకు ఆదేశించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. కోర్టు తీర్పుపై జలీల్ ఇంకా స్పందించలేదు.
Read Also: USA: బైడెన్ పరిపాలనలో కీలక స్థానాల్లో ఇండో అమెరికన్స్..
ఎమ్మెల్యే జలీల్ ఇటీవల కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 12న తన ఫేస్ బుక్ పోస్టులో కాశ్మీర్ గురించి వివరిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో విలీనం అయిన కాశ్మీర్ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ గా పిలిచే వారని.. ఇది పాకిస్తాన్ నియంత్రణలో లేని ప్రాంతం అని.. ఇదే విధంగా భారత్ ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ‘‘భారత్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్’’ అని ఇందులో కాశ్మీర్ లోయ, లడఖ్ ఉంటాయని వ్యాఖ్యానించారు.
దీంతో పాటు కాశ్మీర్ ప్రజలు నవ్వడాన్ని మరిచిపోయారని.. ఎందుకంటే ప్రతీ రోజూ ఆర్మీ సైనికులు ఉన్నారని.. కాశ్మీరీ ప్రజలు నవ్వడం మరిచిపోయిన మనుషులుగా మారారని వ్యాఖ్యానించాడు. ఆర్మీ ట్రక్కులు, మిలిటరీ కాశ్మీరీల రోజూవారీ జీవితంలో భాగంగా మారిందని.. కాశ్మీర్ లోని ప్రతీ ప్రాంతంలో ఒక రకమైన ఉదాసీనత దాగి ఉండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంపై ఏబీవీపీ కూడా తిరువనంతపురం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. జలీల్ పై కేరళలో రెండు, ఢిల్లీలో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే తన వ్యాఖ్యలను కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేదని..వారి పట్ల సానుభూతి ఉందని జలీల్ మరో పోస్ట్ పెట్టాడు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్ నాదన్ కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ కు ఫిర్యాదు చేశారు.