Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..

  • రూ.3,000 తీసుకుని 9 ఏళ్లు సంబంధం చూపని మ్యారేజ్ బ్యూరో.
  • సేవల్లో లోపం జరిగిందని తేల్చిన కన్స్యూమర్ ఫోరం.
  • ఫీజు రీఫండ్‌తో పాటు రూ.5,000 నష్టపరిహారం, ఖర్చులు చెల్లించాలని ఆదేశం.
  • 30 రోజుల్లో చెల్లించకపోతే 9% వడ్డీ విధింపు.
Marriage Bureau

Marriage Bureau

Marriage Bureau: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల కోసం చాలా మంది మ్యారేజ్ బ్యూరోల వెంట పడుతున్నారు. మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లలోనే పెళ్లిళ్లు కుదురుతున్నాయి. అయితే, దీని వెనక స్కామ్‌లు కూడా ఇలాగే ఉన్నాయి. పెళ్లి కాని అబ్బాయిలును, అమ్మాయిలను డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లకేళ్లు గడిచినా సంబంధాలు సెట్ చేయడంలో విఫలమవుతున్నారు. రేపు మాపు అంటూ అబ్బాయి లేదా అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నారు.

ఇలాంటి మ్యారేజ్ బ్యూరోకు కేరళలో షాక్ తగిలింది. కన్నూర్‌లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (కన్జ్యూమర్ కోర్టు) ఒక మ్యారేజ్ బ్యూరోపై భారీ ఫైన్ విధించింది రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని 9 ఏళ్ల పాటు సరైన వివాహ సంబంధం చూపించడంలో విఫలమైంది. ఈ కేసులో మ్యారేజ్ బ్యూరో సేవల్లో లోపం ఉందని గుర్తించిన కోర్టు ఫీజు చెల్లించడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

కన్నూర్‌కు చెందిన ఓ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ 2016 నవంబర్ 25న రూ.3,000 చెల్లించి ఒక మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నారు. త్వరలోనే తగిన సంబంధం చూపిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా ‘‘ఈసారి మంచి సంబంధం వస్తుంది’’ అంటూ హామీలు ఇచ్చింది కానీ వధువును వెతకడంతో విఫలమైంది. 9 ఏళ్లుగా ఒక్క సంబంధాన్ని చూపించలేకపోయింది.

తన పెళ్లి కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతో కాలం ఎదురుచూశారని సదరు బాధిత ప్రొఫెసర్ కన్జ్యూమర్ ఫోరమ్‌లో తన వాదన వినిపించాడు. 2025లో తన తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని, తల్లి కూడా అనారోగ్యంతో ఉందని చెప్పాడు. మ్యారేజ్ బ్యూరో సరైన సమయానికి తన బాధ్యత నిర్వర్తించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పాడు.

ఫిర్యాదు విచారణకు వచ్చినప్పటికీ మ్యారేజ్ బ్యూరో తరుఫున ఎవరూ హాజరుకాలేదు. ఎలాంటి వివరణ కూడా సమర్పించలేదు. ప్రొఫెసర్ సమర్పించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫీజు చెల్లించిన ఆధారాలును ఫోరమ్ పరిశీలించింది. కమిషన్ మ్యారేజ్ బ్యూరోకు రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు రూ. 3000 పరిహారం ఇవ్వాలని, కోర్టు ఖర్చుల కింద రూ. 2000 ఇవ్వాలని, ఈ మొత్తాన్ని 30రోజుల్లో చెల్లించాలని, గడువులోగా చెల్లించకపోతే రీఫండ్ మొత్తంపై వార్షిక 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.