ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలయ్యాయి. తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఒక్క తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో స్పష్టమైన ఫలితాలు వచ్చేశాయి. తమిళనాడులో హంగ్ ఏర్పడడంతో ఐదు రోజులు తర్జన భర్జన తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది.
ఇక కేరళంలో కూడా స్పష్టమైన ఫలితం వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మెజార్టీ సాధించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ లేదు. వారం రోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇప్పటి వరకు తేల్చలేకపోయింది. ముగ్గురు వ్యక్తుల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. దీంతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీంతో ఈ సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగేటట్టు కనిపిస్తోంది.
ప్రముఖంగా కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కేసీ వేణుగోపాల్‌తో పాటు సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు వినిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు. గత 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చనే అంతర్గత చర్చలు జరిగాయి. అయితే కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే సంప్రదాయానికి బ్రేక్ పడింది. లెఫ్ట్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక వేణుగోపాల్ గత, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. ఆయనకున్న రాజకీయ పలుకుబడి దృష్ట్యా.. తాజా ఫలితాలను బట్టి ఆయనను ముఖ్యమంత్రి పదవికి సహజ పోటీదారుగా పరిగణించారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పార్టీ నాయకత్వం నియమించిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ గురువారం తిరువనంతపురానికి చేరుకున్నప్పుడు… 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు వేణుగోపాల్ పేరును సూచించారు. ఎమ్మెల్యేలే కాకుండా.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు కూడా వేణుగోపాల్‌కు పగ్గాలు అప్పగించాలని సూచించారు. కానీ ఇంతలోనే ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందిన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన సతీశన్ పేరు కూడా లైన్‌లోకి వచ్చింది. సతీశన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని మిత్రపక్షమైన ఐయూఎంఎల్ డిమాండ్ చేసింది. దీంతో ఎలాగైనా సీఎం పదవి దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు రమేష్ చెన్నితాల కూడా తన సీనియారిటీ ఆధారంగా ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అయితే ఫలితాలు వేణుగోపాల్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలియగానే. కేరళలోని సతీషన్ మద్దతుదారులు సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రచారాన్ని ప్రారంభించాయి. కేరళ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో హైకమాండ్ సందిగ్ధంలో పడింది. ఎవరిని కేరళం ముఖ్యమంత్రిగా నియమించాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఘర్షణలు తలెత్తకుండా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది.
